Kesineni Nani: ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగించరాదనే ఈ కుట్ర: కేశినేని నాని
- జగన్ తో కలసి మోదీ, అమిత్ షాల డ్రామానే బాబ్లీ కేసు
- ఏపీ అభివృద్ధిని మోదీ ఓర్వలేకపోతున్నారు
- 2019లో మోదీకి ప్రజలు బుద్ధి చెబుతారు
ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ద్వేషంతోనే ప్రధాని మోదీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకునేందుకే బాబ్లీ అంశాన్ని తెరమీదకు తెచ్చారని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ తో కలసి మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఆడిన డ్రామానే బాబ్లీ కేసు అని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో మోదీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబును మోదీ, అమిత్ షాలు ఏమీ చేయలేరని చెప్పారు. చంద్రబాబు నాయకత్వాన్ని, ఏపీ అభివృద్ధిని ఓర్వలేకే మోదీ కక్ష సాధింపులకు దిగుతున్నారని అన్నారు.
ఐక్యరాజ్యసమితిలో ఈ నెల 24న ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్-గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు. వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి ఆయనను ఆహ్వానించింది.