kanna lakshminarayana: 22 వాయిదాలకు గైర్హాజరైన కారణంగానే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది!: 'బాబ్లీ కేసు'పై కన్నా
- 2013 నుంచి కేసు నడుస్తోంది
- 2016 వరకూ అప్పుడప్పుడు కోర్టుకు హాజరయ్యారు
- 3 సార్లు కోర్టుకు వెళ్లకపోయినా నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుంది
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై ఏపీలో రాజకీయం బాగా వేడెక్కుతోంది. టీడీపీలో నిరసన జ్వాలలు చెలరేగుతుంటే.. నోటీసులను ప్రచారాస్త్రాలుగా చంద్రబాబు వాడుకుంటున్నారని వైసీపీ విమర్శిస్తోంది. నోటీసులివ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతుంటే.. బీజేపీ మాత్రం నోటీసుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని పేర్కొంటోంది. చంద్రబాబుకు నోటీసుల అంశంపై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబుకు నోటీసులు రావడం వెనుక ప్రధాని మోదీ ఉన్నారనేది అవాస్తవమని తెలిపారు.
2013 నుంచి కేసు నడుస్తోందని.. 2016 వరకూ అప్పుడప్పుడు కోర్టుకు హాజరయ్యారని.. చివరి 22 వాయిదాలకు మాత్రం గైర్హాజరైన కారణంగానే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని కన్నా తెలిపారు. సాధారణంగా 3 సార్లు కోర్టుకు వెళ్లకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుందని.. అలాంటిది 22 సార్లు గైర్హాజరయి.. నోటీసులు వస్తే అది మోదీ చేయించారని కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.