Nalgonda District: నడిరోడ్డుపై యువకుడి ప్రాణాలు తీశారు.. మిర్యాలగూడలో దారుణ పరువు హత్య!
- నల్గొండ జిల్లాలో అందరూ చూస్తుండగానే దారుణం
- ఆసుపత్రి బయటే యువకుడిని నరికి చంపిన దుండగుడు
- యవతి తల్లిదండ్రులపైనే అనుమానం
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కలకలం సృష్టించింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ కుమార్తె నిండు జీవితాన్ని సర్వనాశనం చేశాడా తండ్రి. నచ్చిన వాడిని మనువాడిందన్న కోపం.. తమను ఎదిరించి పరువు తీసిందన్న కసి.. వెరసి యువకుడి ఉసురు తీశాడు. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు. రెండు మూడు రోజులుగా ఈ జంటను వెంబడిస్తున్న హంతకుడు, శుక్రవారం సాయంత్రం వీరు ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా పథకాన్ని అమలు చేశాడు. వెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో వెనక నుంచి వచ్చి యువకుడి మెడపై వేటేశాడు. అతను కుప్పకూలిపోగానే తలపై మరో వేటేశాడు. అంతే, రక్తపు మడుగులో అక్కడికక్కడే యువకుడు మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక చర్చిబజారుకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ (24) బీటెక్ పూర్తిచేసి కెనడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఎల్ఐసీ ఉద్యోగి. స్థానికంగా నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరునగరు మారుతీరావు ఏకైక కుమార్తె అమృత బీటెక్ చదువుతోంది. ప్రణయ్-అమృత హైదరాబాద్‌లో చదువుకుంటున్న సమయంలో ప్రేమించుకున్నారు.
విషయం ఇంట్లో వాళ్లకి చెప్పినా కులాలు వేరుకావడంతో వారు ఒప్పుకోలేదు. తన కుమార్తెను వదిలిపెడితే రూ.3 కోట్లు ఇస్తానని అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్‌కు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. వీటికి లొంగని ప్రణయ్ ఈ ఏడాది జనవరి 31న అమృతను హైదరాబాద్ తీసుకెళ్లి ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం మిర్యాలగూడకు వచ్చి కాపురం పెట్టారు.
అప్పటి నుంచి ప్రణయ్‌కు వేధింపులు మొదలయ్యాయి. అమృత తండ్రి పలుమార్లు బెదిరించాడు. తమను బెదిరిస్తున్నది తండ్రే అనే అనుమానంతో అమృత పోలీసులను ఆశ్రయించింది. తమకేదైనా జరిగితే తండ్రిదే బాధ్యత అని డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. కౌన్సెలింగ్‌తో మార్పు వచ్చినట్టు నటించిన మారుతీరావు.. అప్పటి నుంచి కుమార్తె, అల్లుడితో ఫోన్లో మాట్లాడుతూ తాను మారిపోయినట్టు నమ్మించాడు. అయితే, లోలోన మాత్రం కక్షతో రగిలిపోతున్న ఆయన అవకాశం కోసం ఎదురుచూడసాగాడు.
శుక్రవారం సాయంత్రం అక్కతో కలిసి ప్రణయ్ గర్భిణి అయిన తన భార్యను స్థానిక జ్యోతి ఆసుపత్రికి పరీక్షల కోసం తీసుకొచ్చాడు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు ఆసుపత్రి బయట పార్క్ చేసిన కారు వద్దకు వెళ్తుండగా, అక్కడ మాటువేసిన దుండగుడు వెనకనుంచి వచ్చి ప్రణయ్‌ను నరికేశాడు. తొలుత మెడపై వేటువేయగా అతడు అక్కడే కూలిపోయాడు. ఆ తర్వాత తలపై మరోవేటు వేశాడు. దీంతో ప్రణయ్ ప్రాణాలొదిలాడు.
తనముందే జరిగిన హత్యను చూసి షాక్‌కు గురైన అమృత, ప్రణయ్ అక్క భయంతో తిరిగి అసుపత్రిలోకి పరుగులు తీశారు. ఈ ఘటనంతా ఆసుపత్రి సీసీ కెమెరాల్లో రికార్డైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు అమృత తండ్రి మారుతీరావును ఏ-1గా, అమృత బంధువు శ్రవణ్‌ను ఏ-2గా చేర్చి కేసు నమోదు చేశారు.