Nara Bhuvaneshwari: కేరళ వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత.. పుస్తకాలు, మందులతో కేరళ బయలుదేరిన లారీ!
- కేరళ వరద బాధితుల కోసం రూ.16 లక్షల విలువైన ఔషధాలు
- రూ.14 లక్షల విలువైన లాంగ్ నోటు పుస్తకాలు
- లారీలను జెండా ఊపి ప్రారంభించిన నారా భువనేశ్వరి
కేరళ వరద బాధితులకు సాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకొచ్చింది. బాధితుల కోసం రూ.16 లక్షల విలువైన 20 రకాల ఔషధాలు, విద్యార్థుల కోసం రూ.14 లక్షల విలువైన 50 వేల లాంగ్ నోట్ పుస్తకాలను సేకరించిన సంస్థ వాటిని లారీలలో కేరళకు పంపింది. మనవడు దేవాన్ష్‌తో కలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి జెండా ఊపి లారీలను ప్రారంభించారు.
అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ ఇవి కేరళకు చేరుకున్నాక ట్రస్ట్‌కు చెందిన స్వచ్ఛంద సేవకులు, కేరళలోని జీ-టెక్ సంస్థతో కలిసి పంపిణీ చేస్తారన్నారు. ఔషధాల సేకరణలో నాట్కో, శ్రీనివాస్ ఫార్మా (లక్ష్మీ ఫార్మా) వంటి సంస్థలు సహకారం అందించాయని భువనేశ్వరి తెలిపారు. సేకరించిన ఔషధాలను కేరళ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో బాధితులకు పంపిణీ చేస్తామని ట్రస్ట్ సీఈవో టి.విష్ణువర్ధన్ తెలిపారు.