KTR: నా కొడుకు చిన్న పిల్లాడు.. వాడిని కూడా వదిలిపెట్టరా?: కేటీఆర్ ఆవేదన
- నా కుమారుడి వయసు 13 ఏళ్లు
- అతడి శరీరాకృతి గురించి మాట్లాడతారా?
- వింటుంటే గుండె తరక్కుపోతోంది
తనను విమర్శించడానికి ప్రతిపక్షాలకు ఎటువంటి అంశాలు దొరకకపోవడంతో చివరికి తన కుమారుడిని కూడా లాగుతున్నారని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సీఎం కుటుంబంలోని చిన్న పిల్లలను కూడా ప్రతిపక్షాలు వదలడం లేదన్నారు. తన కొడుకు ఏం తప్పు చేశాడని ప్రశ్నించారు.
తన కుమారుడు 13 ఏళ్ల చిన్న పిల్లాడని, అభం.. శుభం తెలియని అతడి శరీరాకృతిపైనా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విమర్శలు చూసి రాజకీయాల్లో ఉండడం అవసరమా? అనిపించిందన్నారు. వ్యక్తిగతంగా విషం చిమ్ముతుంటే బాధనిపిస్తోందన్నారు. ఇది చాలా బాధాకరమని, ఇటువంటివి వింటున్నప్పుడే రాజకీయాల గురించి పునరాలోచించుకోవాలని అనిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.