maa: 'మా' వివాదానికి శుభం కార్డు.. పెద్దల చొరవతో అందరూ ఒకటైపోయారు!
- 'మా'ను కుదిపేసిన నిధుల దుర్వినియోగం ఆరోపణలు
- రెండుగా చీలిపోయిన అసోసియేషన్
- పరిస్థితిని చక్కదిద్దిన ఇండస్ట్రీ పెద్దలు
నిధుల దుర్వినియోగం ఆరోపణలతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. 'మా' అధ్యక్షుడు శివాజీరాజా, సెక్రటరీ నరేష్ (సీనియర్)లు రెండు వర్గాలుగా చీలిపోయి, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, సినీ పెద్దలు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దారు. రెండు వర్గాలను మళ్లీ ఏకం చేశారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ప్రతి సంస్థలో ఇలాంటి సమస్యలు వస్తుంటాయని చెప్పారు. రెండు వర్గాలు ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేశాయని అన్నారు. ఇకపై అన్ని విషయాలను కలెక్టివ్ కమిటీనే చూసుకుంటుందని చెప్పారు. 'మా'లో ఎలాంటి అవకతవకలు జరగలేదని సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కలెక్టివ్ కమిటీ విచారణలో తేలిందని తెలిపారు. భవిష్యత్తులో మీడియాతో కలెక్టివ్ కమిటీనే మాట్లాడుతుందని చెప్పారు.
శివాజీరాజా మాట్లాడుతూ, చిన్న మనస్పర్థలు వచ్చిన మాట నిజమేనని, అన్ని వివరాలను కలెక్టివ్ కమిటీ ముందు ఉంచామని, ఎలాంటి అవకతవకలు జరగలేదని తేలిందని చెప్పారు. నరేష్ మాట్లాడుతూ, ఏ సంస్థలోనైనా భేదాభిప్రాయాలు రావడం సహజమేనని, రాబోయే రోజుల్లో జరిగే ఈవెంట్స్ ని కలసికట్టుగా సక్సెస్ చేస్తామని తెలిపారు. గతం గత: అని చెప్పారు.