chandrababu: ప్రతి శుక్రవారం కోర్టులో నిలబడే వ్యక్తి నన్ను తిడతాడు.. మనం ఈ దేశ పౌరులు కాదా?: చంద్రబాబు
- ఉత్తర తెలంగాణ ఎడారిగా మారకూడదనే బాబ్లీ పోరాటం చేశా
- 2010లో జరిగిన దానికి.. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు
- ఏపీని బీజేపీ మోసం చేసింది
బీజేపీ, వైసీపీలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి బోనులో నిలబడే వ్యక్తి కూడా తనను తిడుతున్నాడని వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రిని అడ్డంపెట్టుకుని, అడ్డంగా దోచేసి, ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా... జీతాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారకూడదనే బాబ్లీ ప్రాజెక్టుపై పోరాటం చేశానని... మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి, ఇబ్బందులు పెట్టారని చెప్పారు. ఎప్పుడో 2010లో జరిగిన దానికి, తనకు ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చారని అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చినసాన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. తోటపల్లి కాల్వల ఆధునికీకరణకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రయోజనాల కోసం ఎన్డీయేతో పొత్తు పెట్టుకుంటే... బీజేపీ మోసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని మాట తప్పారని దుయ్యబట్టారు. రెవెన్యూ లోటు రూ. 16 వేల కోట్లు ఉంటే, కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 3,900 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా, రెండంకెల వృద్ధిని సాధించామని చెప్పారు. రాష్ట్ర సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ దేశ పౌరులు కాదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి మనం పన్నులు కట్టడం లేదా? అని అన్నారు.
త్వరలోనే ఐదు పుణ్య నదులను కలిపి, మహా సంగమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు 175 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని... ఈ జిల్లాను అగ్రస్థానంలో నిలబెడతానని హామీ ఇచ్చారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా రాష్ట్రం ఉన్నతి కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అందరి చేత జల ప్రతిజ్ఞ చేయించారు.