Chandrababu: మోదీ వ్యతిరేక శక్తులు బలోపేతం కావడంపై బీజేపీ అక్కసు!: యనమల
- ఎనిమిదేళ్ల నాటి కేసుకు ఇప్పుడు వారెంట్లు ఏమిటి?
- తెలుగు వాళ్లు సుభిక్షంగా ఉండాలనే నాడు లాఠీ దెబ్బలు తిన్నారు
- సర్వేల ముసుగులో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరన్న యనమల
ఏపీ సీఎం చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడంపైనా, బీజేపీ తప్పుడు సర్వేలను చేయించడంపైన ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వ్యతిరేక శక్తులు బలోపేతం కావడంపై బీజేపీ అక్కసు వెళ్లగక్కుతోందని ఆయన అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదేళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టు అంశంపై పోరాడితే ఇప్పుడు వారెంట్లు రావడమేంటని ప్రశ్నించారు.
తెలుగువాళ్లు ఎక్కడున్నా సుభిక్షంగా ఉండాలన్న ధ్యేయంతోనే నాడు 74 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు లాఠీ దెబ్బలు తిన్నారని తెలిపారు. అవినీతిపరులకు అండగా ఉంటూ దొంగలందరినీ బీజేపీ దేశం దాటిస్తోందని ఆయన మండిపడ్డారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా పరారీ వెనుక గుట్టును, ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పరారు కావడం వెనుక అసలు సూత్రధారులను బీజేపీ వెల్లడించాలన్నారు. తమ చెప్పుచేతల్లో ఉన్న మీడియా సంస్థల ద్వారా బోగస్ సర్వేలు చేయించారని యనమల ఆరోపించారు. సర్వేల ముసుగులో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం అసాధ్యమన్నారు. బీజేపీ చేపడుతున్న వేధింపు చర్యలకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.