Chandrababu: రెండు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు మూల్యం చెల్లించుకోబోతున్నారు: తలసాని
- ఆరు నెలల క్రితమే టీడీపీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదిరింది
- తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ లేదు
- ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు అమిత్ షాకు లేదు
ఢిల్లీలోని బీజేపీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలసి తనపై కుట్రలు పన్నారన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అర్థరహితమని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బాబ్లీ కేసులో వచ్చిన అరెస్ట్ వారెంట్ ను కూడా చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. దివంగత ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తో పొత్తుపై ఏపీ టీడీపీ నేతలు చంద్రబాబును నిలదీయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ లేదని విమర్శించారు. ఆరు నెలల క్రితమే టీడీపీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదిరిందని... పొత్తు మూలంగా తెలంగాణ, ఏపీల్లో చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన సలహాదారుగా వున్న రాజీవ్ శర్మను బ్రోకర్ అంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రిలయన్స్ సంస్థకు బ్రోకర్ గా వ్యవహరించారా? అంటూ తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిబంధనల ప్రకారం రావాల్సిన నిధులనే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంట్లో ఉన్న డబ్బును ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు అమిత్ షాకు లేదని అన్నారు. ఇప్పుడున్న ఐదు స్థానాల్లో బీజేపీ గెలిస్తే చాలా గొప్ప అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు క్యాడర్ లేదని చెప్పారు.