Chandrababu: చంద్రబాబుకు ఇంకా చేరని వారెంట్!
- బాబ్లీ కేసులో చంద్రబాబుకు వారెంట్
- మీడియా వార్తలు తప్ప తమకు తెలియదన్న సీఎం కార్యాలయం
- ఎనిమిదేళ్ల నాడు నమోదైన కేసు
ఎనిమిది సంవత్సరాల నాటి బాబ్లీ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు జారీ అయిన వారెంట్లు, ఇంకా ఆయనకు అందలేదు. ధర్మాబాద్ మేజిస్ట్రేట్ జారీ చేసిన వారెంట్లు రాష్ట్ర పోలీసులకు అందలేదని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. 2010లో బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ, అప్పటి విపక్షనేతగా ఉన్న చంద్రబాబు, పలువురు టీడీపీ నేతలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వారెంట్ జారీ కాబడిన వ్యక్తి వేరే రాష్ట్రంలో ఉంటే, ఆ రాష్ట్ర పోలీసులకు సమాచారం అందిస్తారు. కోర్టు ఆదేశాల ప్రకారం, ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, నిర్ణయించిన తేదీన కోర్టులో హాజరు పరుస్తారు. ఒకవేళ సదరు వ్యక్తి వీఐపీ అయితే, ఆ తేదీలోగా కోర్టుకు వెళ్లి వారెంటును కొట్టి వేయించుకోవాలని సూచిస్తారు. ఒక్కోసారి వారెంట్ జారీ కాబడిన వ్యక్తి తరఫున న్యాయవాది కోర్టుకు వెళ్లి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరే అవకాశం కూడా ఉంటుంది.
కాగా, వారెంట్ జారీ అయిన సంగతి మీడియాలో వార్తల ద్వారా తెలుసుకోవడం తప్ప, అధికారిక సమాచారం అందలేదని సీఎం కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఆయన చిరునామా తెలియదని అనడానికి కూడా ఆస్కారం లేదని, న్యాయమూర్తి నోటీసులు ఇచ్చిన తరువాత, అందులోని నిందితులందరికీ అధికారికంగా సమాచారం అందించాల్సిన బాధ్యత అక్కడి పోలీసులదేనని ఆయన అన్నారు.