Miryalaguda: మధ్యాహ్నం ప్రణయ్ అంత్యక్రియలు, విధ్వంసం జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భారీ బందోబస్తు!
- ఢిల్లీకి చేరుకున్న ప్రణయ్ సోదరుడు ప్రవీణ్
- మధ్యాహ్నం 2 గంటల తరువాత అంత్యక్రియలు
- ఆందోళనలకు దిగితే చర్యలుంటాయని పోలీసుల హెచ్చరిక
శుక్రవారం నాడు మిర్యాలగూడలో దారుణంగా హత్యకు గురికాబడిన పెరుమాళ్ల ప్రణయ్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జరగనున్నాయి. ప్రణయ్ సోదరుడు, ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చేస్తున్న ప్రవీణ్, ఢిల్లీకి చేరుకున్నాడు. ప్రవీణ్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్ కు, అక్కడి నుంచి రెండు గంటల సమయానికి మిర్యాలగూడకు చేరుకుంటాడని తెలుస్తోంది. సోదరుడు వచ్చిన తరువాత అంత్యక్రియలు జరగనుండగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రణయ్ హత్యను నిరసిస్తూ, నిన్న మిర్యాలగూడ బంద్ కు పిలుపునిచ్చిన దళిత సంఘాలు, నేటి అంతిమయాత్రలో విధ్వంసానికి పాల్పడవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పట్టణంలో పోలీసు బందోబస్తును పెంచారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా చూస్తామని, ఆందోళనకు పాల్పడితే ఎవరినీ వదలబోమని పోలీసులు హెచ్చరించారు.