Anantapur District: తాడిపత్రిలో ఉద్రిక్తత.. ఇద్దరి గొంతు కోసిన దుండగులు!
- రెండో రోజు కొనసాగుతున్న ఆందోళనలు
- పోలీస్ స్టేషన్ ముందు జేసీ ఆందోళన
- క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమం
అనంతపురం తాడిపత్రి మండలంలో పరిస్థితి మరింత దిగజారింది. ఈ రోజు జరిగిన ఘర్షణల్లో దుండగులు ఇద్దరు వ్యక్తుల గొంతు కోశారు. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో పలు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 2,000 మంది ప్రబోధానంద అనుచరులు, చిన్న పొడమల గ్రామస్తులకు ఈ ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామస్తులకు మద్దతుగా నిలిచిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. ఆశ్రమ నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా ఆశ్రమం మీదుగా వెళ్లరాదని చిన్నపొడమల గ్రామస్తులను ప్రబోధానంద స్వామి వర్గీయులు నిన్న హెచ్చరించారు. దీనికి గ్రామస్తులు కూడా దీటుగా స్పందించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలు తాజాగా రెండో రోజూ కొనసాగాయి. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అధికారులు బాష్పవాయువును ప్రయోగించారు. పరిస్థితి చేయిదాటుతూ ఉండటంతో జిల్లా అదనపు ఎస్పీ, ఆర్డీవో అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ ప్రకటించారు.