jc diwakar reddy: నా జీవితంలో ఈరోజు చాలా దురదృష్టకరమైనది: జేసీ దివాకర్ రెడ్డి
- గణేష్ నిమజ్జనం సందర్భంగా తాడిపత్రి మండలంలో ఉద్రిక్తత
- బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జేసీని అడ్డుకున్న పోలీసులు
- స్టేషన్ కు తాళం వేసి, రోడ్డుపై బైఠాయించిన దివాకర్ రెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొడమలలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రబోధానందస్వామి వర్గీయులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ దాడుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, 45 మందికి గాయాలయ్యాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గ్రామస్తుల తరపున... తాడిపత్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తాళం వేసి, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జీవితంలో ఇది చాలా దురదృష్టకరమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. ఏరోజు తాను పోలీసులకు వ్యతిరేకంగా కూడా మాట్లాడింది లేదని, ఇలా రోడ్డుకెక్కడం తన జీవితంలో మొదటిసారని చెప్పారు.
డేరాబాబా ఆశ్రమం స్థాయిలో ప్రబోధానంద ఆశ్రమంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని జేసీ ఆరోపించారు. ఇలాంటివి తమ గ్రామంలో జరగకూడదని స్థానికులు చెబితే... దాడులకు తెగబడ్డారని చెప్పారు. ఆ ఆశ్రమంపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు ఆశ్రమం గేటు చుట్టూ తిరిగొచ్చారే తప్ప, ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బాధితులను పరామర్శించేందుకు తాను అక్కడకు వెళ్తుంటే... పోలీసులు తనను అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. అందుకే పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించానని చెప్పారు.