Anantapuram: అజ్ఞాత సామ్రాజ్యమే... తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమం గురించిన నమ్మలేని నిజాలు!
- తాడిపత్రి సమీపంలో ప్రబోధానంద ఆశ్రమం
- లోపల పెద్దఎత్తున కర్రలు, రాళ్లు
- విశాలమైన గదులు, సౌకర్యవంతమైన జీవితం
- శాశ్వతంగా నివాసం ఉంటున్న సుమారు 400 మంది
- అతి కష్టం మీద లోపలికెళ్లిన పోలీసు, రెవెన్యూ సిబ్బంది
ఉత్తరాదిన గుర్మీత్ బాబా, ఆశారాం బాపూల ఆశ్రమాలకు ఏమాత్రం తీసిపోదీ ఆశ్రమం. అదే అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఉన్న ప్రబోధానంద ఆశ్రమం. నిన్న మొన్నటి వరకూ ఈ ఆశ్రమం పేరు పెద్దగా తెలియదు. కానీ, చిన్న పొలమడ వాసులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహం నిమజ్జన ఊరేగింపు తమ ఆశ్రమం మీదుగా పోవద్దని ప్రబోధానంద శిష్యులు చేసిన గొడవ, ఆపై ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆశ్రమం పేరు ఇప్పుడు మారుమోగుతోంది. గడచిన రెండు రోజులుగా అతి కష్టం మీద లోపలికి వెళ్లిన పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఆశ్రమంలో నమ్మలేని నిజాలు కనిపించాయి.
దక్షిణాదిన పెద్దఎత్తున భక్తులను కూడగట్టుకున్న ప్రబోధానంద యోగీశ్వరులను ఆశ్రమంలో ఉన్న భక్తులు ఎవరూ ఇంతవరకూ ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు. ప్రబోధానంద శ్రీకృష్ణుని అంశని భావించే వీరంతా, త్రైత సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నారు. తమ గురువు వీడియో మాధ్యమంగా ఏం చెబితే వీరు అదే చేస్తుంటారు. ఇక్కడ శాశ్వతంగా 350 నుంచి 400 మంది భక్తులు ఉంటుండగా, మరో 100 నుంచి 200 మంది వచ్చిపోతుంటారని అధికారులు గుర్తించారు.
ఇక్కడ పూజలు మాత్రమే జరుగుతాయని చెబుతున్నా, భక్తుల వ్యవహార శైలితో తమకు ఎన్నో సందేహాలు వస్తున్నాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఆశ్రమంలోకి ఇతరులెవరికీ అనుమతి ఉండదు. నాలుగు అంతస్తుల భారీ భవంతిలో పెద్ద సంఖ్యలో నివాస గదులు, వందలమంది సుఖంగా గడిపేందుకు కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ పెద్దఎత్తున రాళ్లు, కర్రలను నిల్వ చేసి ఉంచారు. భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, ఏదైనా జరిగితే భక్తులను అప్రమత్తం చేసేందుకు సైరన్ కూడా ఉన్నాయి.
కాగా, శనివారం రాత్రి ప్రబోధానంద కుమారుడు ఆశ్రమంలోనే ఉన్నాడని తెలుస్తోంది. ఘటన జరిగిన తరువాత, ఆయన కారు ఎక్కి వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్టు పోలీసులు గుర్తించారు. అయితే, బయటకు వెళితే, గ్రామ ప్రజలు దాడి చేయవచ్చన్న ఆలోచనతో భక్తులంతా కలసి రక్షణగా ఏర్పడి, అతన్ని ఆశ్రమంలోకి క్షేమంగా తీసుకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ప్రబోధానంద ఆశ్రమంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు విచారిస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.