Goa: గోవాకు కొత్త సీఎం... పనాజిలో కేంద్ర బృందం!
- క్లోమగ్రంధి సమస్యతో బాధపడుతున్న పారికర్
- ప్రస్తుతం న్యూఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స
- గోవా సంకీర్ణ భాగస్వాములతో చర్చించిన బీజేపీ నేతలు
క్లోమగ్రంధి సమస్యతో బాధపడుతూ, ఇటీవల అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చిన తరువాత కూడా, అనారోగ్యం బారిన పడి ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ (62)ను మార్చాలని బీజేపీ భావిస్తోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యేంతవరకూ ఎవరైనా సీనియర్ మంత్రిని సీఎంగా ప్రకటించాలని గోవా సంకీర్ణంలోని ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని వార్తలు వస్తున్న వేళ, కేంద్రం నుంచి బీజేపీ బృందం పనాజిలో పర్యటించింది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులైన బీఎస్ సంతోష్, రామ్ లాల్, రాష్ట్ర ఇన్చార్జి విజయ్ పురాణిక్ బృందం గోవాకు వచ్చి, సంకీర్ణ భాగస్వాములైన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ నేతలను సంప్రదించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ వెల్లడించారు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్, అధికారం చేపట్టాలన్న ఆదుర్దా తమకు లేదని వ్యాఖ్యానించింది. కాగా, 40 మంది ఎమ్మెల్యేలున్న గోవాలో కాంగ్రెస్ కు 16, బీజేపీకి 14, జీఎఫ్పీ, ఎంజీపీలకు ముగ్గురు చొప్పున, ఎన్సీపీకి ఒకరు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.