Andhra Pradesh: తాడిపత్రిలో కొనసాగుతున్న టెన్షన్.. జేసీకి ఫోన్ చేసిన చంద్రబాబు!
- ఆశ్రమ నిర్వాహకులపై చర్యలకు జేసీ డిమాండ్
- అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని ఫిర్యాదు
- నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు
అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలంలో రెండ్రోజుల క్రితం చెలరేగిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. చిన్నపొడమల, పెద్దపొడమల గ్రామస్తులకు, ప్రబోధానందస్వామి వర్గీయులకు మధ్య తలెత్తిన గొడవలో ఇప్పటివరకూ ఓ సీఐ సహా 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణలో కొందరు దుండగులు ఇద్దరు వ్యక్తుల గొంతును కోయగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులకు మద్దతుగా నిన్న రాత్రి బైఠాయించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాత్రంతా అక్కడే గడిపారు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు.
తాజాగా ఈ రోజు ఉదయం జేసీ దివాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. అక్కడి పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులపై దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలని చంద్రబాబును ఆయన కోరారు. గ్రామస్తులకు న్యాయం జరిగే వరకూ తాను పోలీస్ స్టేషన్ ముందు నుంచి కదలబోనని వెల్లడించారు. ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజున పూజల పేరుతో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆయన సీఎంకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పెద్దిరెడ్డిని హైదరాబాద్ కు తరలించినట్లు జేసీ మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో కళ్లు దెబ్బతిన్న వారికి మెరుగైన చికిత్స కోసం నిపుణుల్ని అనంతపురానికి రప్పిస్తున్నట్లు చెప్పారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆశ్రమం మీదుగా వెళ్లరాదని ప్రబోధానంద స్వామి వర్గీయులు హెచ్చరించడంతో చిన్నపొడమల, పెద్ద పొడమల గ్రామస్తులు తిరగబడ్డారు. గ్రామస్తులకు జేసీ దివాకర్ రెడ్డి మద్దతుగా నిలవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ పాండియన్.. జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో, డీఎస్పీతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు.