Srinivasa Reddy: సినీ నటుడు శ్రీనివాసరెడ్డి పేరిట ఫేస్బుక్లో నకిలీ ఖాతా.. వరద బాధితులకు సాయం కోసమంటూ డబ్బులు వసూలు!
- హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి పేరిట నకిలీ ఖాతా
- కేరళ వరద బాధితుల కోసమంటూ విరాళాల సేకరణ
- సహాయ దర్శకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు, ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ఫేం శ్రీనివాసరెడ్డి పేరిట ఫేస్బుక్లో నకిలీ ఖాతా తెరిచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై శ్రీనివాసరెడ్డికి క్షమాపణలు చెప్పించి, ఖాతాను తొలగించడంతో వివాదానికి ఫుల్స్టాప్ పడింది.
హైదరాబాద్, సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. నటుడు శ్రీనివాసరెడ్డి పేరిట ఇటీవల ఫేస్బుక్లో నకిలీ ఖాతా ఏర్పాటైంది. సినీ పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న రవికిరణ్ అనే వ్యక్తి ఈ ఖాతాను సృష్టించినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ ఖాతా నుంచి చాటింగ్ ప్రారంభించిన రవికిరణ్ ఎవరికీ అనుమానం రాకుండా అచ్చం శ్రీనివాసరెడ్డిలానే చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో కేరళ వరద బాధితుల కోసం విరాళాలు సేకరిస్తున్నామని, తోచినంత ఇవ్వాలంటూ పోస్టు పెట్టాడు.
అతడి పిలుపునకు స్పందించిన కొందరు రూ.5 వేల చొప్పున అతడు చెప్పిన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశారు. విషయం తెలిసిన నటుడు శ్రీనివాసరెడ్డి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు రవికిరణ్‌ను నిందితుడిగా గుర్తించి స్టేషన్‌కు పిలిపించారు. రవికిరణ్ కేవలం డబ్బుల కోసమే ఈ పనిచేశాడని, శ్రీనివాసరెడ్డిపై ద్వేషంతో కాదని గుర్తించిన పోలీసులు అతడిని మందలించారు. చేసిన తప్పుకు శ్రీనివాసరెడ్డికి క్షమాపణ చెప్పించి, ఖాతాను తొలగించడంతో వివాదం సమసింది.