Mahabubnagar: రూ.. 4,500 జరిమానా కట్టలేని మందుబాబుకు 37 రోజుల అదనపు జైలు శిక్ష!
- మహబూబ్ నగర్ లో డ్రంకెన్ డ్రైవ్
- పూటుగా తాగి దొరికిపోయిన వ్యక్తి
- 67 రోజుల జైలుశిక్ష విధించిన న్యాయమూర్తి
పూటుగా మందుకొట్టి, వాహనం నడిపి, పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన ఓ మందుబాబు, న్యాయమూర్తి విధించిన జరిమానా చెల్లించలేదని చెప్పి మరో 37 రోజుల జైలుశిక్షకు గురైన ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం ఐదుగురు పట్టుబడగా, పోలీసులు వారిని మొబైల్ కోర్టుముందు హాజరు పరిచారు.
వారిని విచారించిన న్యాయమూర్తి తేజో కార్తీక్, ఓ వ్యక్తి విపరీతంగా తాగి, వాహనం నడిపినట్టు గుర్తించి, అతనికి నెల రోజుల జైలుశిక్ష, రూ. 4,500 జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆపై తాను జరిమానా చెల్లించలేనని చెప్పడంతో మరో 37 రోజుల అదనపు జైలుశిక్ష విధిస్తున్నట్టు తీర్పిచ్చారు. మరో వాహనదారుడికి 10 రోజుల జైలుశిక్ష, రూ. 2,500 జరిమానా, మిగతా ముగ్గురికీ ఐదు రోజుల జైలుశిక్షను, రూ. 3 వేల చొప్పున జరిమానాను విధించారు.