prabodhananda swamy: స్వామీజీకి నేను సాష్టాంగపడ్డానా?: జేసీ దివాకర్ రెడ్డి
- ప్రబోధానంద విషయంలో నేను గెలిచానా లేక ఓడానా అనేది మీడియానే చెప్పాలి
- కులమతాలకు అతీతంగా స్వామి బాధితులు ఉన్నారు
- త్వరలోనే స్వామి వీడియోలను బయటపెడతా
ప్రబోధానంద స్వామి వ్యవహారం ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. వినాయక నిమజ్జనం సందర్భంగా స్వామీజీ అనుచరులకు, స్థానికులకు మధ్య జరిగిన దాడులు ఉద్రిక్తతకు దారి తీశాయి. ప్రబోధానంద ఆశ్రమంపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు 30 గంటలకు పైగా బైఠాయించారు. అనంతరం ముఖ్యమంత్రి స్వయంగా కలగజేసుకోవడంతో... జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.
అనంతరం ఆందోళనను విరమించిన జేసీ దివాకర్ రెడ్డి... ఈరోజు అసెంబ్లీకి వెళ్లారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రబోధానంద వ్యవహారంలో తాను గెలిచానా? లేక ఓడానా? అనే విషయాన్ని మీడియానే చెప్పాలని అన్నారు. స్వామీజీకి తాను సాష్టాంగపడ్డానని కొందరు అంటున్నారని... అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. కులమతాలకు అతీతంగా స్వామి బాధితులు ఉన్నారని అన్నారు. స్వామీజీతో గొడవ పెట్టుకుంటే... తమతమ నియోజక వర్గాల్లో ఇబ్బందులు ఉంటాయని చెప్పే నాయకుల్లో గెలిచేవారు ఎవరూ లేరని జేసీ తెలిపారు. త్వరలోనే ప్రబోధానందకు చెందిన వీడియోలను విడుదల చేస్తానని చెప్పారు.