kiran kumar reddy: కర్నూలు సభలో వైసీపీపై విమర్శలు గుప్పించిన కిరణ్ కుమార్ రెడ్డి
- ప్రజా సమస్యలపై వైసీపీ ఎక్కడా మాట్లాడటం లేదు
- రాహుల్ ప్రధాని అయితేనే ప్రత్యేక హోదా వస్తుంది
- తదుపరి ప్రధాని రాహుల్ గాంధీనే
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేషన్ ద్వారా నిత్యావసర వస్తువులన్నీ ఇస్తామని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1.15 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని చెప్పారు. ప్రజాసమస్యలపై వైసీపీ ఎక్కడా మాట్లాడటం లేదని కిరణ్ మండిపడ్డారు. అధికారంలోకి రావాలన్న ధ్యాస తప్ప ఆ పార్టీ నేతలకు మరో ఆలోచన లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం పతనమవడం ఖాయమని చెప్పారు. దేశ తదుపరి ప్రధాని రాహుల్ గాంధీనే అని జోస్యం చెప్పారు.
విభజన చట్టంలో ఉన్న 11 విద్యాసంస్థలకు రూ. 11,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటే... మోదీ ప్రభుత్వం కేవలం రూ. 640 కోట్లు మాత్రమే ఇచ్చిందని కిరణ్ మండిపడ్డారు. ఇలాంటి బీజేపీని నమ్మాలా అనే విషయాన్ని అందరూ ఆలోచించుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఒక్క ఉద్యమం కూడా చేయలేదని మండిపడ్డారు. వారిని కాల్చండి, వారిని ఉరి తీయండి, వారి చొక్కాపట్టుకోండి అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని... నాయకులు చెప్పాల్సింది ఇదేనా? అని విమర్శించారు. రాహుల్ ప్రధాని అయితేనే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు.