West Bengal: అలా ఊగడం ఆపు, లేదంటే కాళ్లు విరగ్గొట్టేస్తా: సామాన్యుడికి కేంద్ర మంత్రి వార్నింగ్!
- పశ్చిమబెంగాల్ అసన్ సోల్ లో ఘటన
- ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి బాబుల్ సుప్రియో
- కాళ్లు, చేతులు కదుపుతున్న వ్యక్తిపై ఆగ్రహం
కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో రెచ్చిపోయారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సభలో నోరుజారారు. పద్ధతిగా కూర్చోకుంటే కాళ్లు విరగ్గొడతానని ఓ దివ్యాంగుడిని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది.
పశ్చిమబెంగాల్ లోని అసన్ సోల్ లో దివ్యాంగులకు చక్రాల కుర్చీలు అందించే కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన సుప్రియో మాట్లాడుతుండగా, ఓ దివ్యాంగుడైన వ్యక్తి ఇబ్బందిగా కదులుతూ ఉండటంతో ఆయనకు కోపం వచ్చింది. వెంటనే ఆయన్ను ఉద్దేశించి సుప్రియో మాట్లాడుతూ.. ‘ఎందుకు కదులుతున్నావ్? ఏమన్నా సమస్య ఉందా? పద్ధతిగా కూర్చో. నేను నీ కాళ్లు విరగ్గొట్టి ఊతకర్రను ఇవ్వగలను’ అని బెదిరించారు. అక్కడితో ఆగకుండా ఈ సారి సదరు వ్యక్తి కదిలితే వెంటనే కాళ్లు విరగ్గొట్టాలని తన భద్రతా సిబ్బందికి సూచించారు.