Andhra Pradesh: కొండపల్లి సీతారామయ్య భార్య, కమ్యూనిస్ట్ నేత కోటేశ్వరమ్మ కన్నుమూత!
- అతివాద ఉద్యమంలో కీలకపాత్ర
- పుస్తకాలు, పాటల ద్వారా ఉద్యమానికి ఊపిరి
- నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
ప్రముఖ నక్సల్ నేత కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ(100) ఈ రోజు కన్నుమూశారు. విశాఖలోని కృష్ణా కాలేజ్ సమీపంలో మనవరాలు అనురాధ ఇంట్లో ఈ రోజు ఉదయం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత నెల 5న ఆమె తన 100వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు. అయితే సెప్టెంబర్ 10న అనారోగ్యానికి గురికావడంతో కోటేశ్వరమ్మను హుటాహుటిన కేర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆరోగ్యం కొంచెం కుదుటపడటంతో ఇంటికి తీసుకొచ్చారు.
డిశ్చార్జ్ అయినప్పటి నుంచి అస్వస్థతతో బాధపడుతున్న ఆమె ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ చివరి కోరిక మేరకు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రికి అప్పగించనున్నారు. తొలితరం కమ్యూనిస్టు నాయకురాలిగా ఉన్న కోటేశ్వరమ్మ అతివాద ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ‘నిర్జన వారధి’ అనే పుస్తకాన్ని ఆమె రాశారు. అంతేకాకుండా ఆమె మంచి గాయని కూడా. కాగా, కోటేశ్వరమ్మ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు.