imran khan: పొదుపు మంత్రం జపిస్తూ.. విలాసవంతమైన విమానంలో సౌదీఅరేబియాకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్!
- సౌదీ రాజు ఆహ్వానం మేరకు సౌదీఅరేబియా వెళ్లిన ఇమ్రాన్
- ద్వైపాక్షిక అంశాలపై చర్చ
- అనంతరం దుబాయ్ లో ఇండియా-పాక్ మ్యాచ్ పత్యక్ష వీక్షణం
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని, ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఖర్చుల విషయంలో పొదుపు పాటించాలంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పొదుపు మంత్రాన్ని జపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, విదేశీ పర్యటనల్లో సైతం ప్రథమ శ్రేణి ప్రయాణాలు కాకుండా, బడ్జెట్ కు లోబడే ప్రయాణాలు ఉండాలని చెబుతూ... తన ప్రయాణ ఖర్చుల్లో సైతం కోత విధించారు.
ఇంతటి స్థాయిలో పొదుపు మంత్రాన్ని జపిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ప్రధాని హోదాలో తొలి విదేశీ పర్యటనకు బయల్దేరారు. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆహ్వానం మేరకు ఆయన సౌదీఅరేబియాకు వెళ్లారు. అయితే, ఆయన చెప్పినట్టుగా కాకుండా... విలాసవంతమైన ఓ ప్రత్యేక విమానంలో ఆయన సౌదీకి వెళ్లారు. వీవీఐపీ విమానంలో ఇమ్రాన్ వెళ్లడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాక్ అధ్యక్షుడి దగ్గర నుంచి ఆర్మీ అధికార సిబ్బంది వరకు అందరి ప్రయాణాల్లో కోత విధించిన ఇమ్రాన్ ఖాన్... తన పర్యటనకు మాత్రం సకల సదుపాయాలున్న ప్రత్యేక విమానంలో ఎందుకు వెళ్లారంటూ పలువురు విమర్శిస్తున్నారు. లోటు బడ్జెట్ పేరుతో ఖరీదైన వస్తువులు, కార్లను వేలానికి పెడుతూ... ప్రధాని మాత్రం విలాసవంతమైన విమానాల్లో తిరుగుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సౌదీ పర్యటనలో భాగంగా ఆ దేశపు రాజుతో భేటీ అయి... ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇమ్రాన్ చర్చించనున్నారు. అనంతరం ఈరోజు సాయంత్రం దుబాయ్ లో ఇండియా-పాకిస్థాన్ ల మధ్య జరగనున్న ఆసియా కప్ మ్యాచ్ ను ఇమ్రాన్ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.