Telangana: తెలంగాణ ఎన్నికల బరిలో హీరో కల్యాణ్‌రామ్?
- శేరిలింగంపల్లి నుంచి పోటీచేసే అవకాశం
- మహా కూటమి ఎన్నికల ప్రయోగం
- టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా ఎత్తుగడ
దివంగత నందమూరి హరికృష్ణ తనయుడు హీరో కల్యాణ్ రామ్ తెలంగాణ నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు గత కొన్ని రోజులుగా విశేషంగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఓటు బ్యాంకు పుష్కలంగా వుందని భావించే స్థానం నుంచి ఆయన టీడీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా జట్టుకట్టిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ మహాకూటమి వ్యూహంలో భాగంగా కల్యాణ్ రామ్ పోటీకి దిగుతారని తెలుస్తోంది.
మహాకూటమి తన వ్యూహంలో భాగంగా రాజకీయంగా ప్రముఖులైన కుటుంబాల్లోని వారసులను బరిలోకి దించే ప్రయత్నం ప్రారంభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు దివంగత ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి మనుమలు కల్యాణ్‌రామ్, ఆదిత్యరెడ్డిలను అసెంబ్లీ ఎన్నిక బరిలోకి దింపే యోచన చేస్తోంది. హైదరాబాదు శివారు శేరిలింగంపల్లి నుంచి కల్యాణ్‌రామ్, తాండూరు నుంచి ఆదిత్యరెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే శేరిలింగంపల్లి స్థానాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ సూచన ప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. దీంతో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కుటుంబం నుంచి కల్యాణ్ రామ్ కి అవకాశం కల్పించాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఈ విషయంపై కల్యాణ్‌రామ్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
ఇక, చెన్నారెడ్డి మనుమడు, శశిధర్ రెడ్డి కొడుకు ఆదిత్యరెడ్డి తెంగాణ జనసమితి తరపున తాండూరు నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆయన ఇటీవలే టీజేఎస్‌లో చేరారు. ఇక్కడ టీఆర్ఎస్ తరపున మంత్రి మహేందర్ రెడ్డి పోటీ చేయనున్నారు. చెన్నారెడ్డి రాజకీయ జీవితం కూడా తాండూరు నుంచే ప్రారంభమయింది.