kcr: కేటీఆర్ కింద పని చేయడానికి అభ్యంతరం లేదు: హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
- తదపరి ముఖ్యమంత్రి కూడా కేసీఆరే
- కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను శిరసా వహిస్తా
- కేటీఆర్ ను సీఎం చేయాలనుకున్నా... నేను స్వాగతిస్తా
తెలంగాణకు మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ప్రస్తుతం అనవసరమని... తాను ఇక్కడే ఉంటా, తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తానని కేసీఆర్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు. ఒక వార్తా ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు. టీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్, కవితలు ఉన్నారని... వీరిలో తదుపరి సీఎం ఎవరవుతారనే చర్చ రాష్ట్రంలో జరుగుతోందని ఛానల్ ప్రతినిధి ప్రస్తావించగా... కేసీఆర్ ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటే వారే సీఎం అవుతారని హరీష్ చెప్పారు.
రాష్ట్రాన్ని సాధించుకుని, బంగారు తెలంగాణను నిర్మిస్తున్న వ్యక్తి కేసీఆర్ అని... రాష్ట్రం గురించి ఆయన కంటే ఎక్కువగా ఆలోచించే వారు మరొకరు లేరని చెప్పారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, తాను శిరసా వహిస్తానని తెలిపారు. కేసీఆర్ ఏది చెబితే హరీష్ రావు అదే చేస్తాడని స్పష్టం చేశారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం, ప్రజల కోసమేనని చెప్పారు. కేసీఆర్ కు హరీష్ రావు ఒక నమ్మకమైన కార్యకర్త అని అన్నారు. కేటీఆర్ వైపు కేసీఆర్ మొగ్గు చూపినా ఆయన నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానని, కేటీఆర్ కింద పని చేయడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పారు. ఇప్పుడు తమ ముందు ఉన్న ఏకైక లక్ష్యం రానున్న ఎన్నికల్లో 100కు పైగా సీట్లను సాధించడమేనని తెలిపారు. తదుపరి సీఎం ఎవరనే చర్చ ఇప్పుడు అప్రస్తుతమని చెప్పారు.