Telangana: హైదరాబాద్లో అందుబాటులోకి రానున్న రెండో పొడవైన మెట్రో మార్గం
- మొదటి పొడవైన మార్గం ఢిల్లీలో ఉంది
- 24న ప్రారంభంకానున్న ఎల్.బి.నగర్-మియాపూర్ మెట్రో రైల్
- అమీర్పేట ఇంటర్ ఛేంజ్ స్టేషన్లో ప్రారంభించనున్న గవర్నర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మెట్రో రైల్ నిర్వహణలో అరుదైన ఘనత సొంతం చేసుకోబోతోంది. దేశంలో రెండో అతిపొడవైన మెట్రో మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు నిర్మించిన మెట్రో మార్గంలో రైళ్ల రాకపోకలను ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ జెండా ఊపి ప్రారంభిస్తారు.
ఈ మార్గంలో రైళ్ళు పరిగెడితే దేశరాజధాని ఢిల్లీ తర్వాత పొడవైన మెట్రో మార్గం హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చినట్టవుతుందని మెట్రో ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి తెలిపారు. మెట్రో మొదటి దశలో కీలకమైన కారిడార్-1ను పూర్తిస్థాయిలో ప్రారంభిస్తుండడంతో ఒకేసారి 46 కిలోమీటర్ల మేర రైళ్లు పరిగెడతాయి. మియాపూర్ నుంచి ఎల్బీనగర్కు ఉన్న 29 కిలోమీటర్ల దూరాన్ని మెట్రోలో కేవలం 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే రోడ్డు మార్గంలో అయితే 2 గంటల సమయం పడుతుంది.
‘గడచిన కొన్ని రోజులుగా కారిడార్-1లో కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) విధానం అమలుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాం. కేంద్ర రైల్వేశాఖ పరిధిలోని మెట్రో రైల్ సేఫ్టీ అధికారుల బృందం కూడా రకరకాల పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో రైళ్ల రాకపోకలను ప్రారంభించాలని నిర్ణయించాం’ అని ఎండీ రెడ్డి తెలిపారు.