team india: టీమిండియా ఒత్తిడికి గురవుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయింది: వకార్ యూనిస్
- పాకిస్థాన్ ఘోరంగా ఓడిపోవడం అర్థం కాకుండా ఉంది
- వాస్తవానికి పాక్ కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి
- పోరాటం చేయకుండానే చిత్తుగా ఓడిపోయారు
ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ను టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. పాక్ ఆటగాళ్లు ఒత్తిడికి గురి కావడం పట్ల పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా ఒత్తిడికి గురవుతుందని భావిస్తే... పాకిస్థాన్ ఘోరంగా ఓడిపోవడం తనకు అర్థం కాకుండా ఉందని చెప్పారు.
దుబాయ్ లోని విపరీతమైన వేడి వాతావరణంలో ఎక్కువ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఇండియాకు లేదని... ఇదే సమయంలో యూఏఈ అనేది పాకిస్థాన్ కు సొంత గడ్డలాంటిదని వకార్ అన్నాడు. ఇంగ్లండ్ పర్యటన అనంతరం టీమిండియా ఇక్కడకు వచ్చిందని... పాక్ తో మ్యాచ్ కు ముందు రోజు కూడా హాంకాంగ్ పై కష్టపడి భారత్ గెలిచిందని చెప్పారు. వీటన్నిటి నేపథ్యంలో పాక్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావించానని... అయితే, సీన్ మొత్తం రివర్స్ అయిందని తెలిపాడు.
ఎలాంటి పోరాటం చేయకుండానే తమ జట్టు చిత్తుగా ఓడిపోయిందని చెప్పాడు. ఒక మంచి అవకాశాన్ని పాక్ కోల్పోయిందని తెలిపాడు. తన వరకు భారత్-పాక్ ల మధ్య జరిగిన రసవత్తరమైన చివరి మ్యాచ్... 2011లో మొహాలీలో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచేనని చెప్పారు.