Manoharachari: గతంలో మనోహరాచారి ఫ్యాక్షనిస్టుల అనుచరుడు... ఆర్థికంగా చితికిన తరువాతే హైదరాబాద్ కు వలస!
- ఫ్యాక్షన్ నేతల అనుచరుడిగా మనోహరాచారి
- ఆర్థికంగా దెబ్బతిని, హైదరాబాద్ కు వలస
- చిన్న ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని పైకి తెచ్చిన వైనం
ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె మాధవిపై కొబ్బరిబొండాలు కొట్టే కత్తితో పాశవికంగా దాడి చేసిన మనోహరాచారి, గత చరిత్రలో ఫ్యాక్షన్ కోణం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన మనోహరాచారి 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చాడు. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ నాయకులకు అనుచరుడిగా తిరిగిన మనోహరాచారి, ఆర్థికంగా చాలా చితికిపోయాడు.
మాధవి పుట్టిన తరువాత బతుకుదెరువుకు చాలినంత డబ్బు సంపాదన లేదని భావించిన ఆయన, భార్యా బిడ్డలను తీసుకుని రాజధానికి వలస వచ్చాడు. ఆపై అమీర్ పేటలోని ఓ ఆభరణాల దుకాణంలో మెరుగుపెట్టే పనికి చేరాడు. ఆయన భార్య కూడా చిన్న ఉద్యోగం చేస్తోంది. చేతికి అందివచ్చిన కుమారుడు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరగా, ఆ సంపాదనతో తన కుటుంబాన్ని పైకి తెచ్చిన సమయంలో, కుమార్తె ప్రేమ వివాహం ఆయనను రాక్షసుడిగా మార్చింది.