Congress: చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ కు హ్యాండిచ్చిన మాయావతి!
- మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అజిత్ జోగితో జట్టు
- 35 సీట్లలో పోటీ చేస్తామన్న మాయావతి
- ఒంటరిగా గెలిచి చూపుతామన్న కాంగ్రెస్
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ కు పెద్ద షాకిచ్చారు. చత్తీస్ గఢ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెయ్యిస్తూ, అజిత్ జోగి నేతృత్వంలోని చత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ (సీజేసీ)తో చేతులు కలిపారు. ఈ ఎన్నికల్లో సీజేసీతో కలసి పోటీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇదే సమయంలో మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే 22 మంది అభ్యర్థుల పేర్లనూ ఆమె ప్రకటించారు.
కాగా, చత్తీస్ గఢ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అజిత్ జోగిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తరువాత ఆయన కొత్త పార్టీని పెట్టి, కాంగ్రెస్ ఓట్లు చీల్చగా, అది బీజేపీకి వరమై అధికారాన్ని సొంతం చేసుకుంది.
"చత్తీస్ గఢ్ లో అజిత్ జోగితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. 35 సీట్లలో మేము పోటీ చేస్తాం. చత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ మిగతా 55 సీట్లలో పోటీ చేస్తుంది. మేమే గెలుస్తాం. అజిత్ జోగి తదుపరి ముఖ్యమంత్రి అవడం ఖాయం. మేము ఈ నిర్ణయం తీసుకున్న కారణం మీకు తెలుసు. ఏ రాష్ట్రంలో అయితే, మమ్మల్ని గౌరవంగా చూసి, తగినన్ని సీట్లు ఇస్తారో, వారితోనే మేము కలుస్తాం" అని మాయావతి వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జ్ పీఎల్ పునియా వెల్లడించారు. మాయావతి, అజిత్ జోగీల కూటమి తమ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపబోదని అన్నారు.