Behar: లైంగిక వేధింపుల వార్తల విషయంలో మీడియాకు సుప్రీంకోర్టు హెచ్చరిక.. స్టే ఎత్తివేత!
- సంచలనాల కోసం పాకులాడవద్దు
- ఘనటపై మీడియాయే తీర్పులివ్వడం సరికాదు
- వార్తలు రాయొద్దంటూ పట్నా హైకోర్టు విధించిన స్టే ఎత్తివేత
బీహార్ వసతి గృహాల్లో వెలుగు చూసిన లైంగిక వేధింపుల ఘటనలపై వార్తలు రాయొద్దంటూ పట్నా హైకోర్టు విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేసింది. అదే సమయంలో లైంగిక వేధింపుల ఘటనలపై మీడియా అత్యుత్సాహాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. లైంగిక దాడి, వేధింపుల కేసుల్లో మీడియా సంయమనం పాటించాలని, సంచలనాల కోసం పాకులాడకూడదని హెచ్చరించింది. వసతి గృహాల్లో వెలుగు చూసిన అంశాలపై వార్తలు రాయొద్దంటూ పట్నా హైకోర్టు విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ నివేదితా ఝా అనే పాత్రికేయురాలు పిటిషన్ దాఖలు చేశారు.
బీహార్ ఘటనలో దారుణాలను వెలుగులోకి తెచ్చింది మీడియానే అని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. పిటిషన్ విచారించిన జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ‘ఓ వైపు కేసు నడుస్తుంటే మరో వైపు మీడియా తీర్పులు ఇవ్వడం సరికాదు’ అని సూచించింది. ‘తప్పుతోవ పట్టించే వార్తల విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవనిపిస్తోంది. దీనిపై ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్, ఎన్బీఎస్ఏకు సమాచారం అందిస్తాం’ అని జస్టిస్ లోకూర్ తెలిపారు.