Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ లో నలుగురు పోలీసుల రాజీనామా వార్తలు అవాస్తవం: కేంద్ర హోం శాఖ
- ‘ఉగ్ర’ ఘటనతో పోలీసులు రాజీనామా చేయలేదు
- ఇవన్నీ వదంతులే..నమ్మొద్దు
- జమ్ముకశ్మీర్ పోలీస్ శాఖ కూడా నిర్ధారించింది
జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో స్పెషల్ పోలీస్ అధికారుల (ఎస్పీఓ)ను హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు భయపడిపోయిన నలుగురు పోలీసులు తమ విధులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాలకు చేరాయి. ఇర్షాద్ అహ్మద్ బాబా, నవాజ్ అహ్మద్ లోన్, షాబీర్ అహ్మద్ ఠాకూర్ లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నామని, దీని వెనుక ఎవరి బలవంతం లేదని ఆయా వీడియోలలో ఉన్నట్లు సమాచారం.
కేంద్ర హోం శాఖ ఖండన
నలుగురు పోలీసులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారంటూ వస్తున్న వార్తలను కేంద్ర హోం శాఖ ఖండించింది. ఈ వార్తలన్నీ అబద్ధమని, ఈ వదంతులను నమ్మొద్దని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. జమ్ముకశ్మీర్ లోని ఎస్పీఓలు రాజీనామాలు చేశారంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయని, ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. కొందరు వదంతులు వ్యాపింప జేస్తున్నారని, ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ పోలీస్ శాఖ కూడా నిర్ధారించిందని ఆ ప్రకటనలో తెలిపింది.