komatireddy: నాకు షోకాజ్ నోటీసులివ్వడం కాదు.. మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలి: కోమటిరెడ్డి ఫైర్
- నా సూచనలను పాజిటివ్ గా తీసుకోవాలి
- పార్టీ పదవులు అమ్ముకునే వారా నాకు నోటీసులిచ్చేది?
- కరుడు గట్టిన కాంగ్రెస్ నేతనైన నాకు షోకాజ్ నోటీసులా?
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై టీపీసీసీ షోకాజ్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లోగా సమాధానమివ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ, టీపీసీసీపై ఆయన నిప్పులు చెరిగారు.
ఈ మేరకు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ‘నాకు షోకాజ్ నోటీసులివ్వడం కాదు.. మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలి. నా సూచనలను పాజిటివ్ గా తీసుకోవాలి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 31 జిల్లాల్లో సర్వే చేయించి గెలిచే అభ్యర్థుల్ని ఎంచుకోవాలి. అంతేగానీ గాంధీభవన్ లో కూర్చుని నోటీసులు ఇవ్వడం సరికాదు.
అసభ్యంగా మాట్లాడే వారికే పదవులు వస్తాయా? సంస్కారంతో మాట్లాడే మాలాంటి వారికి పదవులు రావా? పార్టీ పదవులు, టికెట్లు అమ్ముకునే వారా నాకు షోకాజ్ నోటీసులిచ్చేది? కరుడు గట్టిన కాంగ్రెస్ నేతను నేను.. నాకు షోకాజ్ నోటీసులా? బలమైన నాయకుల నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నాలాంటి వాళ్లు అవసరమో, కాదో, తేల్చుకోండి? కాంగ్రెస్ పార్టీలో కొందరి తప్పుల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడాల్సి వస్తోంది.
‘కాంగ్రెస్’లో కేడర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ ఆవేదనతోనే నిన్న నేను అలా మాట్లాడాను తప్ప మరో ఉద్దేశం లేదు. 70 ఏళ్లు నిండినోళ్లే మేమే పోటీ చేస్తామంటే ఎలా? 41 మందితో కూడిన కమిటీని చూసి జనం నవ్వుకుంటున్నారు. 100 నియోజకవర్గాలకు 41 మందితో కమిటీనా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నీ చెప్పేశాక.. ఇంకా మేనిఫెస్టో కమిటీ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తోంది. గాంధీభవన్ లో పదవులు అమ్ముకుంటున్నారు’ అంటూ తీవ్రంగా ఆరోపించారు.