rafale: ప్రధాని మోదీ దేశ ద్రోహానికి పాల్పడ్డారు.. సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారు: రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
- వేల కోట్ల రాఫెల్ డీల్ ను అనిల్ అంబానీకి మోదీనే స్వయంగా అప్పగించారు
- నిజాలను బయటపెట్టినందుకు ఫ్రాంకోయిస్ కు ధన్యవాదాలు
- దేశాన్ని మోదీ మోసం చేశారు
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సర్వీస్ ప్రొవైడర్ గా రిలయన్స్ డిఫెన్స్ ను ఎంపిక చేయడంలో తమ పాత్ర ఏమీ లేదని... రిలయన్స్ డిఫెన్స్ పేరును భారత ప్రభుత్వమే సూచించిందంటూ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హోలాండ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఢిల్లీని కుదిపేస్తున్నాయి. విపక్షాలన్నీ మోదీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలోనే రాఫెల్ అతి పెద్ద కుంభకోణమంటూ ఇప్పటికే విమర్శిస్తున్న రాహుల్... దేశాన్ని మోదీ మోసం చేశారంటూ మండిపడ్డారు. మోదీ దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తనకు తానే స్వయంగా వేల కోట్ల విలువైన డీల్ ను అనిల్ అంబానీకి మోదీ అప్పగించారని రాహుల్ విమర్శించారు. రాఫెల్ ఒప్పందం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టినందుకు ఫ్రాంకోయిస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఫ్రాంకోయిస్ వ్యాఖ్యలతో అనిల్ అంబానీకి మోదీనే స్వయంగా డీల్ ను అప్పగించారనే విషయం స్పష్టమయిందని చెప్పారు. దేశ ద్రోహానికి పాల్పడ్డ మోదీ... దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారని విమర్శించారు.