Nellore District: నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్.. జెడ్పీ చైర్మన్, పార్టీ పదవులకు బొమ్మిరెడ్డి రాజీనామా!
- వెంకటగిరి ఇన్ చార్జీగా ఆనంను నియమించిన వైసీపీ
- కనీస సమాచారం ఇవ్వకపోవడంపై బొమ్మిరెడ్డి మనస్తాపం
- పార్టీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు
నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పార్టీతో పాటు జెడ్పీ చైర్మన్ పదవికి ఈ రోజు రాజీనామా చేశారు. వైసీపీలో గతకొంత కాలంగా చురుగ్గా ఉన్న బొమ్మిరెడ్డి వెంకటగిరి అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్నారు. కానీ ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని పార్టీ అధిష్ఠానం తాజాగా వెంకటగిరి ఎన్నికల ఇన్ చార్జీగా నియమించడంతో ఆయన మనస్తాపానికి లోనయ్యారు. రాజీనామా సందర్భంగా బొమ్మిరెడ్డి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వెంకటగిరిలో వైసీపీ బాధ్యతలు చూస్తున్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆనం రాంనారాయణ రెడ్డిని నియమించడం బాధ కలిగించిందని బొమ్మిరెడ్డి తెలిపారు. వెంకటగిరిలో పోటీకి రూ.50 కోట్లు ఖర్చవుతాయనీ, అంత పెట్టుకోగలవా? అని జగన్ అడిగారని విమర్శించారు. జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీచేసిన టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ, వైసీపీ నేత కొమ్మి లక్ష్మయ్య నాయుడిపై ఘన విజయం సాధించారు.