Jagan: ఆనం రూ. 50 కోట్లు పెడతారట... మీరు పెట్టగలరా? అని అడిగారు: వైకాపాకు రాజీనామా చేసిన తరువాత బొమ్మిరెడ్డి
- ఆనం నియామకంతో మనస్తాపంతో రాజీనామా
- చెప్పకుండా ఆనంను తెచ్చారని బొమ్మిరెడ్డి వ్యాఖ్య
- రాజీనామా చేసిన తరువాత జగన్ పై సంచలన వ్యాఖ్యలు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కనీసం రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాలని వైఎస్ జగన్ చెప్పినందునే ఆ పార్టీకి రాజీనామా చేశానని నెల్లూరు జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్ కు తనను కాదని, ఇటీవల వైకాపాలో చేరిన ఆనం రామనారాయణరెడ్డిని ఇన్ చార్జ్ గా నియమించడంతో మనస్తాపానికి గురైన ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ కుటుంబానికి నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉందని, ఎమ్మెల్సీగా, జడ్పీ చైర్మన్ గా పనిచేసిన తనకు చెప్పకుండా, ఇన్ చార్జ్ పదవి నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. జగన్ సీఎం అయితే, నాయకులు, ప్రజల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని ఆయన అన్నారు. తన పార్టీ నేతలకు కనీస మర్యాదను జగన్ ఇవ్వరని ఆరోపించారు. తాను ఎంతో శ్రమించి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిచే స్థాయికి తెచ్చానని, పార్టీ పరంగా చేసిన సర్వేల్లోనూ ఇదే తేలిందని అన్నారు. అన్నీ బాగున్నాయనుకున్న సమయంలో జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు.
నెలన్నర క్రితంమే తనను పక్కన పెడతారని అర్థమైందని చెప్పిన బొమ్మిరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి లోట్స్ పాండ్ కు వెళ్లి జగన్ను కలిసిన ఆ మరుసటి రోజే తానూ వెళ్లానని అన్నారు. నాడు జగన్ సమక్షంలోనే జిల్లా ఇన్ చార్జి సజ్జల, మాట్లాడుతూ, "ఆనం ఆర్థిక మంత్రిగా చాలా సంపాదించారు. ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చు పెడతారట. మీరు అంత మొత్తాన్ని పెట్టగలరా?" అని అడిగారని, తనకు అన్యాయం జరగబోతోందని అప్పుడే అర్థమయ్యిందని చెప్పారు.