KVP: బహిరంగ లేఖలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కేవీపీ రామచంద్రరావు!
- నాడు హోదా వద్దని చెప్పింది ఆయనే
- ప్యాకేజీ భేషంటూ తీర్మానాలు చేశారు
- ఇప్పుడు హోదా కోసం కొత్త డ్రామా: కేవీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేస్తున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. నాడు హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీ ముద్దని వ్యాఖ్యానించిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ఓ బహిరంగ లేఖ రాసిన ఆయన, ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ ఓ మారు, ఆపై బీజేపీతో తెగదెంపులు తీసుకుని, ప్రత్యేక హోదా కావాలని కోరుతూ మరోమారు అసెంబ్లీలో తీర్మానం చేయడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు కొత్త డ్రామాను ప్రారంభించారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుదని, ఆయన ప్యాకేజీకి ఒప్పుకుని సన్మానాలు కూడా చేయించుకున్నారని కేవీపీ గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడే ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హోదా ఇస్తుందని తెలిపారు.