Pawan Kalyan: ఆ ఆలోచన ఉన్న వారే ‘జనసేన’లోకి రావాలి: పవన్ కల్యాణ్
- రొట్టెల పండుగలో పాల్గొనేందుకు నెల్లూరు వెళ్లిన పవన్
- జనసేన అభిమానులు, కార్యకర్తలతో సమావేశం
- సమాజానికి సేవ చేసే ఆలోచనతో పార్టీలోకి రావాలి
తనపై అభిమానంతో కాకుండా, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన ఉన్న వారు మాత్రమే జనసేన పార్టీలోకి రావాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జనసేన పార్టీలోకి వచ్చే వారికి ప్రజలపై అంకితభావం, ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉండాలని, అలాంటి తపన ఉన్న వారిని కచ్చితంగా పార్టీలోకి ఆహ్వానిస్తామని, తమ పార్టీలో కుల, మతాలకు ఆస్కారం ఉండదని మరోసారి స్పష్టం చేశారు.
కాగా, చిన్నప్పుడు తనకు విద్య నేర్పించిన గురువులను పవన్ కల్యాణ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పవన్ చిన్ననాటి స్నేహితులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తన గురువులు తనకు పాఠాలు నేర్పలేదని, విలువలు నేర్పారని ప్రశంసించారు. ఈరోజున తమ టీచర్లను కలవడం తనకు లభించిన అరుదైన అవకాశమని, వారికి పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు.