baited ambush: 'బెయిటెడ్ అంబుష్' ద్వారా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మట్టుబెట్టిన మావోలు
- బెయిటెడ్ అంబుష్ అంటే ఎర వేసి మట్టుబెట్టడం
- 'మాట్లాడుకుందాం రండి' అని పిలిపించి.. నేతలను మట్టుబెట్టిన వైనం
- దాడికి పాల్పడిన వారిలో సగం మంది మహిళలే
మావోయిస్టుల తూటాలకు విశాఖ మన్యం దద్దరిల్లింది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఆరు రౌండ్లు కాల్చడంతో నేతలిద్దరూ అక్కడికక్కడే ప్రాణలను విడిచారు. ఈ ఘటనలో 60 మంది సాయుధులైన మావోయిస్టులు పాలుపంచుకున్నారు.
వీరిలో సగం మంది పాతికేళ్లలోపు వారే. అంతే కాదు వీరిలో సగం మంది మహిళలే. నేతలిద్దరినీ తీసుకెళ్లడం, కాల్చి చంపడం వరకు మహిళా మావోయిస్టులే చేయడం ఆశ్చర్యపరుస్తోంది. మహిళా మావోయిస్టులంతా 5 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... వీరందరికీ ఓ మహిళ నాయకత్వం వహించడం. 'మీ ఖేల్ ఖతం' అనే మాట ఆమె నోటి వెంట రాగానే ఇద్దరినీ కాల్చి చంపారు. రక్తపు మడుగులో ఉన్న వారిపై కసిగా మరో రెండు రౌండ్లు కాల్చారు.
కిడారి, సామలను చంపడానికి 'బెయిటెడ్ అంబుష్' విధానాన్ని మావోయిస్టులు అనుసరించారు. బెయిటెడ్ అంబుష్ అంటే... ఎరవేసి మట్టు పెట్టడం. ఆ ఎర ఏ రూపంలోనైనా ఉండవచ్చు. గిరిజనుల రూపంలో అభ్యర్థనలు పంపించి, అక్కడకు వచ్చిన వారిని హతమార్చవచ్చు. లేదా చిన్న ఘటనకు పాల్పడి, దానిపై ఆరా తీసేందుకు వచ్చిన బలగాలను మట్టుపెట్టి పెను విధ్వంసానికి పాల్పడవచ్చు. ఇలాంటి ఎర వేయడంలో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ దిట్ట. గత ఏడాది 12న బస్తర్ లో బెయిటెడ్ అంబుష్ ద్వారా ఉచ్చులోకి లాగి 25 మంది సీఆర్పీఎఫ్ బలగాలను మావోలు అంతమొందించారు. నిన్న విశాఖ మన్యంలో కూడా అధికార పార్టీకి చెందిన నేతలను 'మాట్లాడుకుందాం రండి' అని పిలిపించే మట్టుబెట్టినట్టు సమాచారం. మిలీషియా సభ్యులు వస్తారని అంచనా వేయని నేతలిద్దరూ అక్కడకు వెళ్లి, ఉచ్చులో చిక్కుకున్నారని పోలీసు అధికారులు అంటున్నారు.