Jagan: మరో మైలురాయి... నేడు 3000 కిలోమీటర్ల మైలురాయిని తాకనున్న జగన్ పాదయాత్ర!
- దేశపాత్రునిపాలెంకు చేరుకోగానే చారిత్రక ఘట్టం
- ప్రత్యేక పైలాన్ ను ఆవిష్కరించనున్న జగన్
- విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, అలుపెరగకుండా నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర నేడు 3 వేల కిలోమీటర్ల మైలురాయిని తాకనుంది. నిన్నటివరకూ విశాఖపట్నం జిల్లాలో సాగిన యాత్ర, నేడు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. ఆయనకు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్ రెడ్డి, పి.రాజన్న దొర, పుష్పశ్రీవాణి, మజ్జి శ్రీనివాసరావు, పెన్మత్స, కడుబండి శ్రీనివాసరావు తదితరులు సరిహద్దుల వద్ద ఘన స్వాగతం పలికారు.
ఈ ఉదయం జగన్, ఎస్ కోట నియోజకవర్గం కొత్తవలస మండలం చింతల పాలెంలో నడుస్తున్న వేళ, రహదారులు జనసంద్రంగా మారిపోయాయి. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న జగన్, తనను పలకరిస్తున్న వారితో మాట్లాడుతూ, అభిమానులతో సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా చింతల పాలెంలో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. ఈ మధ్యాహ్నం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని తాకనుండగా, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో ఇందుకు గుర్తుగా ప్రత్యేకంగా నిర్మించిన పైలాన్ ను జగన్ ఆవిష్కరించనున్నారు. ఆపై సాయంత్రం కొత్తవలసలో జరిగే బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు.