Kidari sarveswara Rao: ఎమ్మెల్యే హత్యకు గురైన ప్రాంతంలో చెంప పిన్నులు.. స్వాధీనం చేసుకున్న క్లూస్ టీం
- ఘటనా స్థలాన్ని సందర్శించిన క్లూస్ టీం
- కీలక ఆధారాలు లభ్యం
- మృతదేహాలకు పూర్తయిన అంత్యక్రియలు
ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేసిన ప్రదేశం నుంచి పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. సోమవారం ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం స్కెచ్‌లు గీసి ఆధారాలు సేకరించింది. మొదటి స్కెచ్‌లో సర్వేశ్వరరావు హత్య తీరును పరిశీలించిన క్లూస్ టీం గడ్డిపై పడి ఉన్న రక్తపు మరకలను సేకరించారు. అలాగే, ఎమ్మెల్యేను ఎంతదూరం నుంచి కాల్చి ఉంటారన్న దానిపై ఓ అంచనాకు వచ్చారు.
ఇక రెండో స్కెచ్‌లో మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహం పడిన ప్రాంతం నుంచి రక్తపు మరకలతో పడి ఉన్న రెండు చెంప పిన్నులను స్వాధీనం చేసుకున్నారు. ఈ చెంప పిన్నుల్లో మావోయిస్టుల తలవెంట్రుకలు వాటికి ఉన్నాయేమో పరిశీలించారు. బహుశా పెనుగులాట వల్లే పిన్నులు కింద పడి ఉండచ్చని క్లూస్ టీం అనుమానిస్తోంది. అలాగే, అతడిని కాల్చినప్పుడు ఓ బుల్లెట్ రోడ్డును గట్టిగా తాకడంతో అక్కడ చిన్న రంధ్రం పడింది. అందులో ఉన్న ఎండిన రక్తాన్ని సేకరించారు.
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాలకు విశాఖపట్టణంలోని కేజీహెచ్ వైద్యబృందం పోస్టు మార్టం చేసింది. వైద్య వర్గాలు అందించిన సమాచారం ప్రకారం, కిడారి శరీరంలోకి మూడు తూటాలు, సోమ శరీరంలోకి ఐదు తూటాలు దూసుకెళ్లాయి. ఇవి ఏకే 47 నుంచి వచ్చినట్టు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం నిన్న మధ్యాహ్నం తరువాత కిడారి సర్వేశ్వరరావు, సోమల అంత్యక్రియలు బంధుమిత్రులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి.