Chandrababu: చంద్రబాబుతో కేసీఆర్ వ్యక్తిగత వైరం పెట్టుకున్నారు: కొండా సురేఖ
- రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను ఎన్నడూ పట్టించుకోలేదు
- టాలీవుడ్ డ్రగ్ కేసు ఏమైంది?
- నియంతను ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ విమర్శించారు. సమస్యల సాధన కోసం కృషి చేయకుండా... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో వ్యక్తిగత వైరం పెట్టుకున్నారని అన్నారు. టాలీవుడ్ డ్రగ్ కేసులు, నయీం కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహాకూటమిని విమర్శిస్తున్న కేటీఆర్... బీజేపీతో ఎందుకు లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారని అడిగారు. రాజకీయ సన్యాసానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలని చెప్పారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ, ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఎర్రబెల్లి అల్లుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే లేని తప్పు... డీఎస్ కొడుకు బీజేపీలో ఉంటే తప్పా? అని సురేఖ ప్రశ్నించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదని... ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పారు. ఇంతవరకు జయశంకర్ స్మారక కేంద్రాన్ని కూడా నిర్మించకపోవడం దారుణమని అన్నారు. పైపుల కంపెనీల నుంచి కమిషన్ల కోసమే మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారని విమర్శించారు. తెలంగాణలో నియంతను ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయని చెప్పారు. పలు పార్టీల నుంచి తమకు ఆహ్వానాలు అందుతున్నాయని... నాలుగైదు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.