Pawan Kalyan: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారశైలి, తీరు రౌడీషీటర్ ను తలపిస్తున్నాయి: పవన్ కల్యాణ్
- చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు
- మనది ప్రజాస్వామ్యమని చింతమనేని మరిచిపోయారు
- ఆయనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలి
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని క్రాంతి కల్యాణ మంటపంలో ఆలిండియా దళిత హక్కుల నేతలు, హమాలీలతో పవన్ సమావేశమయ్యారు. అనంతరం, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులను కొట్టడం, పోలీసులను తుపాకీతో బెదిరించడం, తాజాగా, ఏలూరు లిక్కర్ డిపోలో తన మాట వినలేదని దళిత కార్మికుడిని కులం పేరిట దూషించి, దాడి చేయడం చూస్తుంటే చింతమనేని ప్రభాకర్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఆ బెదిరింపులు, దౌర్జన్యాలు చూస్తుంటే చింతమనేని వ్యవహారశైలి, తీరు రౌడీషీటర్ ను తలపిస్తున్నాయని విమర్శించారు. మనది ప్రజాస్వామ్యమని మరిచిపోయిన చింతమనేని, రాచరిక వ్యవస్థలో మాదిరి నడుచుకుంటున్నారని నిప్పులు చెరిగారు. లిక్కర్ డిపో కార్మికునిపై దాడికి పాల్పడ్డ చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు తమ ఎమ్మెల్యేను క్రమశిక్షణలో పెట్టుకోకపోతే, ఆ బాధ్యతను ప్రజలే తీసుకోవాల్సిన రోజులు వస్తాయని హెచ్చరించారు. ‘మీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారా? లేక ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో చూస్తారా?’ అని చంద్రబాబుకు పవన్ సూటి ప్రశ్న వేశారు.