aravinda sametha: ‘అరవింద సమేత’ మూడో లిరికల్ వీడియో విడుదల
- ‘ఏ కోనలో కూలినాడో..’ అంటూ కొనసాగిన లిరిక్
- కడుపుకోత ఎలాగుంటుందనేది ఈ పాట: సిరివెన్నెల
- ఈ పాట నన్ను పాడమనడం నా అదృష్టం: పెంచలదాసు
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం మూడో లిరికల్ వీడియో సాంగ్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
‘ఏ కోనలో కూలినాడో.. ఏ కొమ్మలో చేరినాడో.. ఏ ఊరికో, ఏ వాడకో, ఏడ బొయ్యాడో..రమ్.. రుధిరం..సమరం..శిశిరం...’ అంటూ సాగే ఈ లిరిక్ సాంగ్ ఆకట్టుకుంది.
ఈ పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇదే వీడియో లో మాట్లాడుతూ, ‘కత్తిమీద సామే నడకనుకుంటే.. పాడె పడకవుతుంది. ఆ పాడె మీద పడుకున్న వాడిని చూసి.. అయిన వాళ్ల కడుపుకోత ఎలాగుంటుందనేది ఈ పాట..’ అని అన్నారు.
‘ఏ కోనలో కూలినాడో. .’ పాటను ఆలపించిన గాయకుడు పెంచలదాసు మాట్లాడుతూ, ‘ఈ పాట నన్ను పాడమనడం నా అదృష్టం. బతుకుకు ఓ సారాంశమైన పాట అనుకున్నాను..’ అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం అందించిన తమన్ మాట్లాడుతూ, ‘ఈ పాటను పెంచలదాసు ఎక్స్ ట్రీమ్లీ టాలెంటెడ్.. అద్భుతంగా పాడారు’ అని ప్రశంసించారు.
కాగా, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ‘అనగనగనగా అరవిందట తన పేరు..’, ‘పెనిమిటి..’ లిరికల్ వీడియో సాంగ్స్ ఇప్పటికే విడుదలయ్యాయి.