Rafel: రిలయన్స్ సాంకేతిక అనుభవంలేని కంపెనీ : డసాల్ట్ టెక్నీషియన్ల అభ్యంతరం
- కంపెనీని భాగస్వామిగా తీసుకోవడంపై అంతర్గతంగా వాదోపవాదాలు
- చివరి నిమిషంలో అనిల్‌అంబానీ కంపెనీకి ఓకే అన్న సీఈఓ
- ఒప్పందం రద్దయ్యే ప్రమాదం ఉందని సిబ్బందిపై ఒత్తిడి
‘ఏ మాత్రం సాంకేతిక అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్‌తో కలిసి పనిచేస్తే డసాల్ట్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ఆ కంపెనీని పార్టనర్‌గా చేర్చుకోకపోవడమే మంచిది’... రాఫెల్ ఒప్పందం సందర్భంగా డసాల్ట్ సాంకేతిక సిబ్బంది వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. కంపెనీకి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు ‘ఇండియా స్కూప్స్’ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రిలయన్స్’ అంశంపై చర్చ ఎంత తారస్థాయిలో నడిచిందీ బయబపెట్టారు.
రిలయన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై కంపెనీ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారని, వారంపాటు పరస్పరం ఈమెయిల్స్ పంపుకున్నారని, చివరికి సీఈఓ ఒత్తిడి మేరకు కలిసి పనిచేసేందుకు అంగీకరించారని వీరు వెల్లడించినట్లు వెబ్‌సైట్ పేర్కొంది. ‘కొత్త కంపెనీతో పనిచేస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో యుద్ధవిమానాలు తయారుచేసే డసాల్ట్ ఇమేజ్ దెబ్బతింటుంది’ అని వీరు నిర్మొహమాటంగా చెప్పేశారు.
అయితే ‘రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా తీసుకోకుంటే భారత ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసే ప్రమాదం ఉంది’ అంటూ కంపెనీ సీఈఓ ట్రాఫియర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ చివరి నిమిషంలో రిలయన్స్‌ను ఎంపిక చేసినట్లు వీరిద్దరి మాటలను బట్టి తెలుస్తోంది.