mudragada padmanabham: జగన్ కాపులను అమ్ముడుపోయే జాతి అనుకుంటున్నారు.. అవసరమైతే సొంత పార్టీ పెట్టుకుంటాం!: ముద్రగడ
- కాపు కార్పొరేషన్ పేరుతో జగన్ కబుర్లు
- మాజీ మంత్రి చింతా మోహన్ తో భేటీ
- కాపు నేతలతో చర్చించి రాజకీయ కార్యాచరణపై నిర్ణయం
వైసీపీ అధినేత జగన్ కాపులను అమ్ముడుపోయే జాతి అనుకుంటున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. జగన్ రూ.10,000 కోట్లతో కాపు కార్పోరేషన్ అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారనీ, కాపులను పశువులు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తో ముద్రగడ ఈ రోజు తిరుపతిలో భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాపులకు ఎవరు న్యాయం చేస్తారో వారితో కలిసే ముందుకు వెళతామని ముద్రగడ తెలిపారు. కాపు జాతి రిజర్వేషన్ కోసం పోరాడే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తమకెవరూ న్యాయం చేయకుంటే సొంతంగా పార్టీ పెట్టేందుకు వెనుకాడబోమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని కాపు నేతలతో చర్చించి రాజకీయ భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.