Chinthamaneni Prabhakar: పార్లమెంటులో ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పే పవన్ కల్యాణ్ ను ఏమనాలి?: చింతమనేని ప్రభాకర్
- ఆయనకు ఆ మాత్రం తేడా తెలియదు
- స్క్రిప్ట్ లో ఉన్నదాన్నే మాట్లాడతాడు
- నేను ఎవరి జీవితంతోనూ చెలగాటం ఆడలేదు
ప్రజల బాధను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించడంలో తన రౌడీయిజం ఉంటుందని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. తనలో ఓవైపు మాత్రమే పవన్ చూశాడనీ, రెండో వైపు చూస్తే తట్టుకోలేడని వ్యాఖ్యానించారు. దెందులూరులో గంటపాటు మాట్లాడిన పవన్ తన నియోజకవర్గంలోని ఒక్క సమస్యను కూడా ప్రస్తావించలేకపోయాడని ఎద్దేవా చేశారు. తాను నియోజకవర్గంలో ఆ స్థాయిలో అభివృద్ధి పనులను చేపట్టానన్నారు. నిన్న పవన్ విమర్శల నేపథ్యంలో విజయవాడలో ఈ రోజు చింతమనేని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తాను ఎవరి జీవితంతోనూ చెలగాటం ఆడలేదని చింతమనేని స్పష్టం చేశారు. తన కారణంగా ఏ ఆడకూతురు తాళిబొట్టు తెగిపోలేదని వ్యాఖ్యానించారు. తనపై 37 పోలీస్ కేసులు ఉన్నాయనీ ఓసారి, 27 పోలీస్ కేసులు ఉన్నాయని మరోసారి పవన్ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి తనపై కేవలం 3 కేసులు మాత్రమే ఉన్నాయని చింతమనేని తెలిపారు.
ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు కేసులు పెడుతూ ఉంటారన్నారు. రాసిచ్చిన స్క్రిప్టు ఆధారంగా పార్లమెంటులో ఎమ్మెల్యేలు ఉంటారని పవన్ కల్యాణ్ చెబుతున్నారనీ, దీన్ని ఏమనాలని ప్రశ్నించారు. పక్కన వాళ్లు రాసిచ్చిన స్క్రిప్టును చదవడం తప్ప పవన్ కు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలకు మధ్య తేడా తెలియని వ్యక్తి తనను విమర్శిస్తున్నాడని చింతమనేని వ్యాఖ్యానించారు.