Sania Mirza: పాక్ జర్నలిస్టుకు దిమ్మదిరిగే సమాధానమిచ్చిన సానియా మీర్జా.. దెబ్బకు ట్వీట్ డిలీట్!
- భార్యను ఇంప్రెస్ చేసే వాడి నుంచి ఇంకేం ఆశిస్తాం
- కనీసం తర్వాతి టోర్నమెంటులోనైనా ఆడతాడో లేదో!
- ట్వీట్ చేసిన పాక్ జర్నలిస్టు
తన భర్త, పాకిస్థాన్ జట్టు ఆటగాడు అయిన షోయబ్ మాలిక్‌ను అవమానించేలా ట్వీట్ చేసిన ఓ పాక్ జర్నలిస్టుకు సానియా మీర్జా దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో అతడు దెబ్బకు తన ట్వీట్‌ను డిలీట్ చేసుకున్నాడు. ఆసియాకప్‌లో పాకిస్థాన్ తన పేలవ ఆటతీరుతో విమర్శల పాలైంది. కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
పాక్ ఆటతీరుపై క్రికెట్ పండితులు విమర్శలు కురిపిస్తుండగా, పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్టు షోయబ్ మాలిక్‌ను ఉద్దేశించి ఉర్దూలో ట్వీట్ చేస్తూ.. ‘‘తన ఆటతీరుతో సానియాను ఏమాత్రం ఇంప్రెస్ చేశాడో ఎవరైనా షోయబ్‌ను అడగండి. కనీసం తర్వాతి టోర్నమెంటులోనైనా దేశం కోసం ఆడతాడేమో తెలుసుకోండి. అయినా, భార్యను సంతోష పరిచేందుకు ఆడే వ్యక్తి నుంచి ఈ దేశం ఇంతకంటే ఇంకేమి ఆశిస్తుంది?’’ అంటూ ఎద్దేవా చేశాడు.
ఈ ట్వీట్ వైరల్ అయి చివరికి సానియా దృష్టికి వచ్చింది. ఇది చూసిన ఆమె అంతే ఘాటుగా బదులిచ్చింది. ‘‘అరే బేచారా.. అమాయకుడిలా ఉన్నావే. నువ్వో ప్రత్యేకమైన ఆసియా కప్‌ను చూస్తున్నట్టుంది’’ అని ట్వీట్ చేసింది. సానియా ట్వీట్‌తో దెబ్బకు సదరు జర్నలిస్టు తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. నిజానికి షోయబ్ మాలిక్ ఆసియా కప్‌లో మరీ అంత చెత్తగా ఏమీ ఆడలేదు. వరుసగా 9, 19, 51, 78, 30 పరుగులు చేశాడు.