police: పోలీస్ ట్రీట్ మెంట్.. వేధింపులు తాళలేక స్టేషన్ లోనే ఉరేసుకున్న లారీ డ్రైవర్!
- చిత్తూరు జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఘటన
- చీటికి మాటికి విచారణకు పిలవడంపై మనస్తాపం
- గుట్టుగా స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు
పోలీసుల వేధింపులు తాళలేక ఓ లారీ డ్రైవర్ ప్రాణాలు తీసుకున్నాడు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చోటుచేసుకుంది.
తమిళనాడులోని కాట్పాడికి చెందిన రాజేంద్ర లారీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ కేసు విషయంలో పోలీసులు చీటికి మాటికీ పిలుస్తూ వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి లోనయ్యాడు. తాజాగా నిన్న మరోసారి విచారణకు హాజరుకావాలని రాజేంద్రను పోలీసులు ఆదేశించారు. తన ప్రమేయం లేకున్నా తనను వేధించడంతో బాధితుడు తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి అక్కడే ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
రాజేంద్రను గమనించిన స్థానికులు, పోలీసులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా, అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర మృతదేహాన్ని పోలీస్ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా కాట్పాడికి తరలించేందుకు యత్నించారు. ఈ ఘటనపై పలువురు స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.