krishna water: కృష్ణా నీళ్లతో సీమ పంటలను కాపాడుతున్నాం.. కడపలో మంత్రి ఆదినారాయణ రెడ్డి!
- జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
- చంద్రబాబు చొరవతోనే సీమకు సాగు, తాగునీరు
- గండికోట రిజర్వాయర్ కు 32 టీఎంసీల నీరు
రాయలసీమలో వర్షాలు సరిగ్గా లేకున్నా కృష్ణా జలాలను తరలించి ప్రాజెక్టులను నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆది నారాయణ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చొరవతో సీమలో పంటలు ఎండిపోకుండా కాపాడగలిగామని చెప్పారు. గాలేరు-నగరి వరద కాలువ ద్వారా గండికోట జలాశయానికి 30 టీఎంసీల నీరు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కడప జిల్లా గండికోట జలాశయం వద్ద ప్రభుత్వ విప్ రామసుబ్బా రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవితో కలిసి మంత్రి ‘జలసిరికి హారతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ను పచ్చగా మార్చాలన్న సీఎం చంద్రబాబు సంకల్పంతో ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందుతోందని మంత్రి ఆది నారాయణ రెడ్డి తెలిపారు. తాము కడపకు 32 టీఎంసీల కృష్ణా జలాలను తీసుకురావాలని ప్లాన్ వేసినట్లు వెల్లడించారు. వీటిలో పాత మైలవరం ప్రాజెక్టుకు 6-7 టీఎంసీలు, పెన్నా నదికి 3 టీఎంసీలు, చిత్రావతి రిజర్వాయర్ కు 6 టీఎంసీలు, పైడిపాలెం ప్రాజెక్టుకు మరో 4 టీఎంసీలు కేటాయిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు చొరవతోనే రాయలసీమకు సాగు, తాగునీరు అందుతోందని స్పష్టం చేశారు.