Narendra Modi: ఒక్క సంతకం కోసం మోదీ మమ్మల్ని 9 నెలలు తిప్పించుకున్నారు!: కేటీఆర్
- బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం 20 సార్లు ప్రధానిని కలిశాం
- మేం పన్నులు కట్టకుండానే నిధులు ఇస్తున్నారా?
- రాబోయే సంకీర్ణంలో టీఆర్ఎస్ కీలకంగా మారుతుందని జోస్యం
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చూస్తే ఓటు వేయాలనుకునేవాడు కూడా మానేస్తాడని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 2014తో పోల్చుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ రోజురోజుకూ దిగజారిపోతోందని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందనీ, ఈ ప్రభుత్వంలో టీఆర్ఎస్ నిర్ణయాత్మకమైన శక్తిగా మారుతుందని జోస్యం చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో పనులు, అనుమతుల కోసం కేంద్రం తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. అప్పట్లో కేవలం ఒక్క సంతకం కోసం ప్రధాని మోదీ తమను 9 నెలలు తిప్పించారని మండిపడ్డారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో మోదీని 20 సార్లు కలిసినా ఫలితం లేకపోయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం రూ.2.3 లక్షల కోట్లు ఇచ్చిందని బీజేపీ చీఫ్ అమిత్ షా చెబుతుండటంపై స్పందిస్తూ.. తాము కట్టిన పన్నులనే తిరిగి రాష్ట్రానికి ఇచ్చారనీ, కొత్తగా ఇవ్వలేదని స్పష్టం చేశారు.